కేసీఆర్ చరిత్రను భూస్థాపితం చేస్తాం: బండి సంజయ్

17-09-2021 Fri 19:05
  • తెలంగాణను కేసీఆర్ మూడు ముక్కలు చేశారు
  • కేసీఆర్ తీరుతో తెలంగాణ తల్లి కంటతడి పెడుతోంది
  • గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తాం
Will bury the KCR history says Bandi Sanjay

బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ మూడు ముక్కలు చేశారని... అందులో ఒక ముక్కను ఎంఐఎం పార్టీకి ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడంలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేశ స్వాతంత్ర్య దినోత్సవం తేదీని కూడా మారుస్తాడని మండిపడ్డారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని... అప్పుడు కేసీఆర్ చరిత్రను భూస్థాపితం చేస్తామని చెప్పారు. కేసీఆర్ నీచ చరిత్రను కూడా పాఠ్యాంశంలో పెడతామని అన్నారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ తల్లి కంటతడి పెడుతోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామని అన్నారు. నిర్మల్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.