కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త ముప్పు!

17-09-2021 Fri 18:55
  • గాల్ బ్లాడర్ లో గ్యాంగ్రీన్
  • నెగెటివ్ వచ్చినవారిలో కొత్త ఇన్ఫెక్షన్
  • గతంలో అనారోగ్య చరిత్ర లేకున్నా గ్యాంగ్రీన్
  • ఢిల్లీలో ఐదుగురిలో గుర్తింపు
  • విజయవంతంగా చికిత్స చేసిన గంగారామ్ ఆసుపత్రి వైద్యులు
New threat posed for covid negative people

కరోనా వైరస్ మహమ్మారి ఎంత ప్రమాదకరమైందో ఈ ఏడాదిన్నర కాలంలో మానవాళికి అర్థమైంది. కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా రోగులు మరణించిన దాఖలాలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. తాజాగా, కొవిడ్ నుంచి కోలుకున్న వారికి కొత్త ముప్పు తలెత్తుతోందని వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా వైరస్ శరీరంలోని అనేక భాగాల్లో తీవ్ర ఇన్ఫెక్షన్లు కలిగిస్తుందని పరిశోధకులు తొలినాళ్లలోనే కనుగొన్నారు.

తాజా పరిశోధనల్లో మరింత ఆందోళన కలిగించే అంశం వెల్లడైంది. కరోనా రక్కసి మానవ శరీరంలోని గాల్ బ్లాడర్ లో గ్యాంగ్రీన్ కు కారణమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలోని వైద్యులు ఐదుగురు కరోనా రోగుల్లో ఈ లక్షణాలను గమనించారు. అది కూడా కరోనా నుంచి కోలుకున్న తర్వాత గాల్ బ్లాడర్ లో గ్యాంగ్రీన్ ఏర్పడిందని వారు వివరించారు. అయితే ఆ రోగులకు సర్ గంగారామ్ ఆసుపత్రిలో విజయవంతంగా చికిత్స అందించారు.

కరోనా బారినపడ్డ తర్వాత గాల్ బ్లాడర్ వాపునకు గురవుతుందని, అది క్రమంగా గ్యాంగ్రీన్ కు దారితీస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు. సాధారణంగా గాల్ బ్లాడర్ లో రాళ్లు, దీర్ఘకాలిక వాపు, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలోనూ, హెచ్ఐవీ బాధితులు, సుదీర్ఘకాలంపాటు నరాల ద్వారా పోషకాలు స్వీకరించేవారు, అధిక కాలం పాటు ఐసీయూ చికిత్సలు పొందినవారిలో ఈ తరహా ఇన్ఫెక్షన్ కనిపిస్తుందని, కానీ కొవిడ్ సోకినవారిలోనూ కోలుకున్న తర్వాత ఈ ప్రమాదకర గ్యాంగ్రీన్ లక్షణాలు వెల్లడవుతున్నాయని వివరించారు.

సర్ గంగారామ్ ఆసుపత్రిలో గాల్ బ్లాడర్ గ్యాంగ్రీన్ కు గురైన వారిలో పైవిధమైన అనారోగ్య చరిత్ర లేకపోయినా, కరోనా కారణంగానే వారి గాల్ బ్లాడర్ దెబ్బతిందని వెల్లడించారు. అయితే వారికి సకాలంలో చికిత్స అందించడంతో కోలుకున్నారని డాక్టర్లు పేర్కొన్నారు.