ఆదివారం జరిగే గణేశ్ శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు చేశాం: మంత్రి తలసాని

17-09-2021 Fri 18:09
  • ఆదివారం గణేశ్ శోభాయాత్ర
  • ముస్తాబవుతున్న భాగ్యనగరం
  • ట్యాంక్ బండ్ లో గణనాథుల నిమజ్జనం
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
Talasani visits Tankbund and reviewed Ganesh Shobha Yatra arrangements

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివారం జరిగే గణేశ్ శోభా యాత్రకు భారీగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. భాగ్యనగర శోభాయాత్రకు దేశవ్యాప్త గుర్తింపు ఉందని తెలిపారు. అన్ని విభాగాల సమన్వయం కోసం వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

హుస్సేన్ సాగర్ పై అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచుతామని వివరించారు. ట్యాంక్ బండ్ పై 1,25,000 మాస్కుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తలసాని వివరించారు.

కాగా, మంత్రి తలసాని వెంట ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర అధికారులు ఉన్నారు.