టేబుల్ సర్దుతుండగా.. మీదకు దూకిన పాము.. ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే..!

17-09-2021 Fri 18:07
  • థాయ్‌ల్యాండ్‌లో వెలుగు చూసిన ఘటన
  • సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో వైరల్
  • ఒక్కసారిగా మీదకు దూకిన పాము
snake lunges at man while he was at a table

ఒళ్లు గగుర్పొడిచే ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. చిన్న తోటలో వేసి ఉన్న డిన్నర్ టేబుల్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఆ టేబుల్ వద్ద నిలబడిన క్షణాల్లోనే పక్క నుంచి ఒక పాము అతని మీదకు ఒక్కసారిగా దూకింది. అతను భయంతో కేకలేస్తూ పక్కకు దూకి పరుగందుకున్నాడు. ఆ పాము చాలా కోపంగా అతన్ని వెంబడించబోయింది. పక్కకు దూకడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉన్నా అతను పాము కాటుకు బలయ్యేవాడే!

అయితే అదృష్టవశాత్తూ అతను తప్పించుకున్నాడు. ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ పాముకు అంత కోపం వచ్చేలా ఆ వ్యక్తి ఏమీ చేయలేదని, కానీ పాము చాలా కోపంగా కనిపించిందని కొందరు అంటున్నారు. మరికొందరైతే ఆ పాము హత్యాయత్నం చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం మెక్సికోలో ఒక యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంట్లో నుంచి ఆమె బయటకు రాగానే పక్కనే ఉన్న కుండీల నుంచి ఒక పాము ఆమెపైకి దూసుకొచ్చింది. అది చూసిన ఆమె భయంతో వెర్రికేకలేస్తూ ఇంట్లోకి పరుగు తీసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.