మా పార్టీ దీక్ష చేసిన తర్వాతే చిన్నారి హత్యాచారం ఘటనపై ప్రభుత్వంలో, పోలీసుల్లో చలనం వచ్చింది: షర్మిల

  • సైదాబాద్ ఘటన నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు
  • ప్రభుత్వంపైనా, పోలీసులపైనా విమర్శలు
  • ఏడు రోజుల తర్వాత కూడా స్పందించలేదని ఆరోపణ
  • తాలిబన్ల తరహా పాలన అంటూ వ్యాఖ్యలు
Sharmila slams TRS Govt and state police

సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటన జరిగిన తర్వాత ఏడు రోజుల వరకు ప్రభుత్వం స్పందించలేదని, పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకోలేకపోయారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల విమర్శించారు. బాధితులది పేద కుటుంబం కావడంతోనే అంత నిర్లక్ష్యం ప్రదర్శించారని, ముఖ్యమంత్రి నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల వరకు ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. అందుకే తమ పార్టీ నిరసన దీక్ష చేపట్టిందని, కేవలం తమ పార్టీ దీక్ష చేపట్టిన తర్వాతే ఈ ప్రభుత్వంలోనూ, పోలీసుల్లోనూ చలనం వచ్చిందని వెల్లడించారు. హోంమంత్రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

కాగా, పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత తమ దీక్షను భగ్నం చేసి, తమ నేతలను ఇళ్లకు తరలించి గృహనిర్బంధం చేశారని షర్మిల మండిపడ్డారు. తమ వద్ద రాళ్లు, కర్రలు లేవని, శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న తమను అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని, తాలిబన్లకు ఇక్కడి పాలకులకు పెద్ద తేడా లేదని విమర్శించారు. గట్టిగా ప్రశ్నిస్తే దొంగ కేసులు పెట్టి జైలుకు పంపుతారని, సీఎం కేసీఆర్ కు తెలిసింది ఇదేనా? అని నిలదీశారు.

నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు... కానీ ఆ నిందితుడ్ని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇది పాలకులు, పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. నేడు జగిత్యాలలోనూ ఇలాంటిదే ఘటన జరిగిందని, ప్రభుత్వం, పోలీసుల ఉదాసీనత నేరస్తులకు అలుసుగా మారిందని షర్మిల అన్నారు.

"రాజు వయసు 30 ఏళ్లు, ఇంతకంటే చిన్న వయసులో భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు విడిచారు. నేటి యువత ఆశలు లేకుండా బతుకుతున్నారు. మాదక ద్రవ్యాలు, మద్యం మత్తులో యువత జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. ఇలాంటివి అరికట్టి యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై లేదా? ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంగా ఉందని మహిళలు అంటున్నారు. దీనికి కేసీఆర్ గారు ఏం సమాధానం చెబుతారు?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News