31,155 ఎకరాల డీకేటీ పట్టాలను గిరిజనులకు ఇచ్చాం: సీఎం జగన్

17-09-2021 Fri 16:23
  • హోం, గిరిజన శాఖలపై సీఎం జగన్ సమీక్ష
  • అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చ
  • గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్న సీఎం
  • సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఉద్ఘాటన
CM Jagan reviews on tribal welfare in state

సీఎం జగన్ ఇవాళ ఏపీ హోం మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల కేంద్ర హోంశాఖ వామపక్ష తీవ్రవాదంపై ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తాజా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు.

మునుపెన్నడూ లేని విధంగా గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. 31,155 ఎకరాల డీకేటీ పట్టాలను గిరిజనులకు అందజేశామని తెలిపారు. 19,919 మంది గిరిజనులు దీని ద్వారా లబ్దిపొందారని వివరించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న గిరిజనులకు రైతు భరోసా కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆ గిరిజనుల భూముల్లో బోర్లు వేశామని, పంటల సాగు కోసం కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు.

గిరిజనులకు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు, వలంటీర్లుగా అవకాశాలు కల్పించామని తెలిపారు. అంతేకాకుండా, ఆసరా, అమ్మఒడి, చేయూత, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.