ఢిల్లీలో సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం

17-09-2021 Fri 15:50
  • సీబీఐ ఆఫీసు బేస్ మెంట్ లో మంటలు
  • ప్యానెల్ బోర్డు నుంచి మొదలైన అగ్నికీలలు
  • రంగంలోకి 8 ఫైరింజన్లు
  • ఆఫీసు నుంచి అధికారులు, సిబ్బంది తరలింపు
Fire accident at CBI Office in Delhi

ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి లోధీ రోడ్డులోని సీజీఓ కాంప్లెక్స్ లో సీబీఐ కార్యాలయం ఉంది. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగినట్టు వెల్లడైంది. వెంటనే అధికారులను, సిబ్బందిని కార్యాలయం నుంచి ఖాళీ చేయించారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో సీబీఐ కార్యాలయం వద్ద మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు.

సీబీఐ కార్యాలయం బేస్ మెంట్ లో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. విద్యుత్ ప్యానెల్ బోర్డులో మంటలు ప్రారంభమైనట్టు ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో గంట తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.