ప్రతి ఒక్కడికీ వడ్డీతో సహా చెల్లిస్తాం: నారా లోకేశ్

17-09-2021 Fri 15:33
  • జగన్ నీవు ఎంత దిగజారావో అర్థమవుతోంది
  • జగన్ నాటకం అందరికీ అర్థమవుతోంది
  • జగన్ లాంటి క్రూర స్వభావం చంద్రబాబుకు లేదు
Nara Lokesh warns Jagan

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అమరావతి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని ముట్టడించిన ఘటన ఏపీలో కలకలం రేపింది. దీనిని టీడీపీ నేత నారా లోకేశ్ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత ఇంటిపై నీ ఎమ్మెల్యేని, బులుగు గూండాలను పంపావంటే నీవు ఎంత దిగజారావో అర్థమవుతోందని అన్నారు. రోజురోజుకు అధఃపాతాళానికి దిగజారుతున్నావని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఉన్న నీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో... మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరమనే విషయం త్వరలోనే నీకు అర్థమవుతుందని అన్నారు.

ఒకప్పడు జగన్ పెట్టిన ముద్దులు ఇప్పుడు పిడిగుద్దుల్లా పడుతున్నాయని లోకేశ్ చెప్పారు. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తేలిపోయాయని అన్నారు. జగన్ ఆడుతున్న నాటకం జనాలందరికీ అర్థమవుతోందని చెప్పారు. జగన్ లాంటి క్రూర, నేర స్వభావం చంద్రబాబుకు లేదని అన్నారు. ప్రతి ఒక్కరికీ త్వరలోనే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.