మా నాన్న అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేకే చంద్రబాబు ఇంటిపై దాడి: అయ్యన్న కుమారుడు విజయ్

17-09-2021 Fri 15:32
  • అయ్యన్న వ్యాఖ్యలతో వైసీపీలో ఆగ్రహం
  • చంద్రబాబు నివాసం ముట్టడి
  • బీసీల ప్రతినిధిగా అయ్యన్న ప్రశ్నలు అడిగారన్న విజయ్
  • దాడులను ఖండించిన రాష్ట్ర పౌరహక్కుల సంఘం
Vijay Patrudu responds to attack on Chandrababu residence

ముఖ్యమంత్రి జగన్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసాన్ని ముట్టడించిన వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అయ్యన్న కుమారుడు విజయ్ పాత్రుడు స్పందించారు. బీసీల ప్రతినిధిగా తన తండ్రి అయ్యన్న కొన్ని ప్రశ్నలు అడిగారని, వాటికి సమాధానం చెప్పలేకనే చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడ్డారని ఆరోపించారు. చెత్తపై పన్నును ప్రశ్నించడమే అయ్యన్న చేసిన తప్పా? అని నిలదీశారు. ఓటమి భయం మొదలైనందుకే జగన్ దాడులను ప్రోత్సహిస్తున్నారని విజయ్ వ్యాఖ్యానించారు.

అటు, ఈ వ్యవహారంపై రాష్ట్ర పౌరహక్కుల సంఘం స్పందించింది. టీడీపీ నేతలపై కర్రలు, రాళ్లతో దాడి దారుణం అని పేర్కొంది. దౌర్జన్యకారులకు పోలీసులే మద్దతుగా నిలవడం దురదృష్టకరమని తెలిపింది. పైగా మీడియాపైనా దాడులు జరిగాయని, వైసీపీ శ్రేణుల తీరును ఖండిస్తున్నామని పౌరహక్కుల సంఘం స్పష్టం చేసింది.