ముఖ్యమంత్రే వెనకుండి ఇదంతా చేయిస్తున్నారు: గోరంట్ల బుచ్చయ్య

17-09-2021 Fri 14:39
  • అయ్యన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఆగ్రహం
  • చంద్రబాబు నివాసం ముట్టడి
  • వైసీపీ, టీడీపీ నేతల బాహాబాహీ  
  • సొమ్మసిల్లిన బుద్ధా వెంకన్న
  • వైసీపీ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారన్న గోరంట్ల
Gorantla Butchaiah Chowdary responds on YCP cadre and CM Jagan

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు నేడు చంద్రబాబు నివాసాన్ని ముట్టడించడం తెలిసిందే. ఎమ్మెల్యే జోగి రమేశ్ తదితరులు బాబు ఇంటి ముందు బైఠాయించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. గద్దె రామ్మోహన్, పట్టాభి, బుద్ధా వెంకన్న తదితర టీడీపీ నేతలు కూడా పోటాపోటీగా రావడంతో ఉద్రికత్త ఏర్పడింది. వాగ్వాదం కొనసాగుతుండగానే బుద్ధా వెంకన్న సొమ్మసిల్లి పడిపోయారు. 

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. వైసీపీ నేతల ప్రవర్తన గూండాలను తలపిస్తోందని విమర్శించారు. కర్రలు, రాళ్లు చేతబూని విపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముట్టడించడం ఏంటని ప్రశ్నించారు. దీనివెనుక సీఎం ఉన్నారని, ఆయనే ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు.

ఇలాంటి వికృత చేష్టలు శోచనీయం అని, పోలీసులు ఎందుకు నిలువరించలేకపోతున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిలదీశారు. జగన్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.