ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్నదే నాన్న గారి ఆశయం: బాలకృష్ణ
- క్యాన్సర్ రోగులకు చికిత్సలో 'బసవతారకం' ముందంజ
- ఆసుపత్రిలో కొత్త టెక్నాలజీ
- డిజిటల్ రేడియోగ్రఫీ ప్రారంభించిన బాలకృష్ణ
- టెక్నాలజీ విషయంలో ముందుంటామని వెల్లడి
ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ఎంతో వేగవంతమైనదని తెలిపారు. సాధారణంగా ఫిల్మ్ పైన తీసే ఎక్స్ రేని డిజిటల్ రూపంలో వెంటనే చూసే వీలుంటుందని వివరించారు. పైగా, ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ద్వారా తీసే ఎక్స్ రే ఇమేజ్ మంచి నాణ్యతతో ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 8 గంటల వ్యవధిలో 200కి పైగా నాణ్యమైన ఎక్స్ రే ఇమేజ్ లు తీయవచ్చని వెల్లడించారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు తక్కువ రేడియేషన్ కు గురవుతారని బాలకృష్ణ వివరించారు. ఇది పర్యావరణ హిత సాంకేతికత అని తెలిపారు.
ఎలాంటి కొత్త టెక్నాలజీనైనా బసవతారకం ఆసుపత్రిలో ప్రవేశపెట్టేందుకు తామెప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్నదే నాన్న గారి ఆశయం అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఏ ఆశయంతో ఈ ఆసుపత్రిని స్థాపించారో అదే స్ఫూర్తితో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.