Cooking Oil: మీరు వాడుతున్న వంట నూనె స్వచ్ఛమైనదేనా?.. ఇలా తెలుసుకోండి!

  • నూనెల్లో కల్తీని తెసుకునేందుకు ఎఫ్ఎస్ఎష్ఏఐ చిట్కా
  • వీడియో విడుదల చేసి అవగాహన
  • వెన్నను ఉపయోగించి కల్తీని ఇట్టే గుర్తించొచ్చు
Detecting Tri  rtho cresyl phosphate Adulteration in Oil

పాల నుంచి తేనె వరకు, కారంపొడి నుంచి చక్కెర వరకు.. మార్కెట్లో లభించే ప్రతి సరుకూ కల్తీనే. నిజానికి కల్తీ లేని స్వచ్ఛమైన సరుకు లభిస్తుందన్న ఊహ కూడా మనకు అందదు. ప్రజలు కూడా కల్తీకి అలవాటు పడిపోయారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీగాళ్లు పెరుగుతున్నారు తప్పితే తగ్గడం లేదు. ప్రత్యామ్నాయం లేక, స్వచ్ఛమైన పదార్థాలు ఎక్కడ దొరుకుతాయో తెలియక దొరికినవే వాడేస్తూ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. మనం నిత్యం వాడే వస్తువుల్లో ఎక్కువగా కల్తీ జరిగే వాటిలో వంట నూనె ఒకటి. ప్రస్తుతం వీటి ధరలు ఆకాశాన్ని అంటడంతో కల్తీ బెడద మరింత పెరిగింది.

కల్తీ సరే.. మరి దానిని గుర్తించడం ఎలా? ల్యాబులకు పంపకుండా ఇంట్లోనే అది కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఓ వీడియోను విడుదల చేసింది. దీని ప్రకారం చిటికెలో నూనెలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవచ్చు. సాధారణంగా వంట నూనెలో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తారు. ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా పక్షవాతం వంటి రోగాలకు దారితీస్తుంది.

ఎఫ్ఎస్‌ఎస్ఏఐ ప్రకారం.. నూనెలో కల్తీని ఇలా సులభంగా గుర్తించవచ్చు. రెండు మిల్లీలీటర్ల నూనెను ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఆ పాత్రలో పసుపు రంగులో ఉన్న వెన్నను వేయాలి. కాసేపటి తర్వాత నూనె రంగు మారితే అది కల్తీదని అర్థం. అంటే ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌తో అది కల్తీ అయిందని అర్థం చేసుకోవాలి. నూనె రంగు మారకుండా ఉంటే అది స్వచ్ఛమైనదని అర్థం. సో.. మరి మీరు వాడుతున్న నూనె ఎలాంటిదో ఈ చిట్కాతో ఇప్పుడే తెలుసుకోండి.

More Telugu News