Revanth Reddy: శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: రేవంత్‌రెడ్డి

Revanth Reddy say Sorry to Shashi tharoor
  • ఇటీవల హైదరాబాద్ వచ్చిన శశిథరూర్
  • తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు
  • శశిథరూర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు  
  • దుమారం రేగడంతో క్షమాపణ
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం చైర్మన్ హోదాలో ఇటీవల హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.

అయితే, తాను నిత్యం విమర్శించే తెలంగాణ ప్రభుత్వాన్ని శశిథరూర్ ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి.. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ శశిథరూర్ పై విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా శశిథరూర్‌ను ఉద్దేశించి అనుచిత పదం ఉపయోగించారు. ఇది వైరల్ కావడంతోపాటు విమర్శలు రావడంపై రేవంత్ స్పందించారు.

శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు తెలిపారు. తాను అత్యంత గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శశిథరూర్ మాత్రమేనన్నారు. తన వ్యాఖ్యలపై శశిథరూర్‌కు వివరణ ఇచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్‌లో అందరూ విలువలు, విధానాలతో పనిచేస్తామని పేర్కొన్నారు. రేవంత్ క్షమాపణలపై స్పందించిన శశిథరూర్.. చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు ఆయన తనకు చెప్పారని అన్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి అందరం కలిసి పనిచేస్తామన్నారు.
Revanth Reddy
Telangana
Shashi Tharoor
Congress

More Telugu News