లీకుల నుంచి తప్పించుకోవడానికి ‘పుష్ప’ టీం కొత్త ప్లాన్.. ఆ ఫొటోలు కూడా లీక్!

16-09-2021 Thu 19:48
  • సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమా
  • రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న దర్శకుడు
  • అవుట్ డోర్ సెషన్ కావడంతో ప్రజలను అదుపు చేయడం కష్టం
  • ఇప్పటికే రష్మిక-బన్నీ మధ్య వచ్చే ఒక సీన్ లీక్
pushpa team could not contain leaks from shooting spot

తెలుగు టాప్ దర్శకుల్లో ఒకరైన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్టు, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది.

అవుట్ డోర్ సెషన్ కావడంతో షూటింగ్ చూడటానికి వచ్చే ప్రజలను అదుపు చేయడం చిత్ర యూనిట్‌కు తలకు మించిన భారం అవుతోంది. ఈ క్రమంలో కొందరు యువకులు సినిమా సెట్లు, బన్నీ నటిస్తున్న కొన్ని సీన్ల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తాజాగా ఒక హోటల్లో అల్లు అర్జున్ టిఫిన్ చేసిన వీడియో కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ లీకులను అడ్డుకునేందుకు పుష్ప టీం కొత్త ప్లాన్ వేసింది. షూటింగ్ స్థలంలో ‘ఫొటోలు, వీడియోలు తీసినచో సెల్లు ఫోన్ పగలగొట్టబడును’ అని బోర్డులు పెట్టారు. అయితే వీటిని కూడా కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మధ్య వచ్చే ఒక సీన్ లీక్ అయిన సంగతి తెలిసిందే.