రైల్వే సిబ్బందిని చూసి చెట్లలో దాక్కున్న రాజు!

16-09-2021 Thu 19:28
  • హత్యాచారానికి పాల్పడి పరారైన రాజు
  • వారం రోజులుగా పోలీసుల గాలింపు
  • స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలుపట్టాలపై మృతదేహం
  • రాజుదేనని గుర్తించిన పోలీసులు
  • మీడియాతో మాట్లాడిన ప్రత్యక్ష సాక్షులు
Witnesses explains what Raju did at railway track

హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, బాలికను బలిగొన్న రాజును కూడా అంతమొందించాలంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్న తరుణంలో, అనూహ్యరీతిలో రాజు స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై విగతజీవుడిలా కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.

కాగా, రాజు రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడాన్ని గమనించిన ఇద్దరు రైల్వే కీ మ్యాన్లు మీడియాకు వివరాలు తెలిపారు. తాము ఉదయం 6 గంటలకు విధుల్లోకి వస్తామని, యథాప్రకారం ఘన్ పూర్ వైపు ట్రాక్ ను పరిశీలిస్తుండగా, ఓ చోట ఒక యువకుడు మాస్కు ధరించి కనిపించాడని ఓ కీమ్యాన్ తెలిపాడు. తాను ఎవరంటూ గట్టిగా ప్రశ్నిస్తే చెట్లలోకి వెళ్లిపోయాడని వివరించాడు.

"ఈ విషయాన్ని తోటి కీమ్యాన్ కి చెబితే మనకెందుకులే అన్నాడు. అక్కడ్నించి మళ్లీ మేం విధుల్లో నిమగ్నమయ్యాం. ఈ విషయాన్ని ట్రాక్ పక్కనే గుడిసె వద్ద ఉన్న ఓ అన్నకు చెప్పాను. దాంతో ఆ అన్న పరిగెత్తుకుని వెళ్లి చూసేసరికి రైలుకు తగిలి వ్యక్తి పడిపోయిన దృశ్యం కనిపించింది అని వివరించాడు. ఆ సమయంలో తాను రైల్వే బ్రిడ్జి కింద ఉన్నానని సదరు కీమ్యాన్ తెలిపాడు.

కాగా, ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన యువకుడు స్పందించాడు. రైల్వే కీమ్యాన్ చెప్పిన విషయంతో రైల్వే బ్రిడ్జి పైకెళ్లి చూశామని, ఆ సయయంలో ఓ యువకుడు బ్రిడ్జికి అవతలి వైపు ట్రాక్ మీద కనిపించాడని వెల్లడించాడు. రైలు వస్తుండడంతో అతడ్ని కాపాడదామన్న ఉద్దేశంతో కేకలు వేశామని, కానీ అతడు తప్పుకున్నట్టే తప్పుకుని, రైలు దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఎదురెళ్లాడని వివరించాడు. ఈ విషయాన్ని తాము పోలీసులకు సమాచారం అందించామని, వారు వచ్చి చేతిపై టాటూలను చూసి మృతుడు ఎవరన్నది నిర్ధారించారని తెలిపాడు.