టీమిండియా న్యూజిలాండ్ పర్యటన వాయిదా!

16-09-2021 Thu 18:32
  • బిజీ షెడ్యూల్, కరోనా నిబంధనలే కారణం
  • వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా జరగాల్సిన మూడు వన్డేలు
  • వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత నిర్వహించాలని ప్లాన్
India tour of Newzealand postponed to 2022

ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే భారత జట్టుతోపాటు న్యూజిలాండ్ క్రికెట్ క్యాలెండర్ కూడా చాలా బిజీగా ఉంది. అదే సమయంలో కరోనా నిబంధనలు కూడా ఈ సిరీస్ రద్దవడానికి కారణంగా కనిపిస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు న్యూజిలాండ్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది.

అదే సమయంలో కివీస్ జట్టు భారత పర్యటనకు వస్తుంది. ఇక్కడ రెండు టెస్టులు, 3 టీ20లు ఆడుతుంది. తిరిగి స్వదేశానికి వెళ్లిన ఈ జట్టు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ కారణంగా బంగ్లాదేశ్‌తో జరగాల్సిన టెస్టు మ్యాచ్ ఆలస్యం అవుతుంది. మళ్లీ భారత జట్టు న్యూజిలాండ్ వచ్చినా క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌లో భారత జట్టు పర్యటన సజావుగా జరగడం అసంభవంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో దీనిపై న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) ప్రతినిధి స్పందించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగి టీ20 ప్రపంచ కప్ తర్వాత ఈ సిరీస్ నిర్వహించడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.