ఆ రివార్డు మాకు ఇస్తారా... రాజు మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది ఆశ!

16-09-2021 Thu 18:00
  • ఆరేళ్ల చిన్నారిపై దారుణ హత్యాచారం
  • రాజును చంపేయాల్సిందేనంటూ ప్రజాగ్రహం
  • రైలు పట్టాలపై శవమై కనిపించిన రాజు
  • స్టేషన్ ఘన్ పూర్ వద్ద ఘటన
Railway gangmen talks to media who identified Raju dead body on railway track

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారకుడైన పల్లకొండ రాజు రైలు పట్టాలపై శవమై కనిపించడం తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని రాజారం గ్రామం వద్ద రాజు మృతదేహాన్ని తొలుత రైల్వే గ్యాంగ్ మెన్ గుర్తించారు. వారు ఓ వీడియోలో ఘటన వివరాలను పంచుకున్నారు.

ఓ గ్యాంగ్ మన్ స్పందిస్తూ... తమ విధుల్లో భాగంగా ట్రాక్ ను తనిఖీ చేసుకుంటూ వెళుతున్నామని తెలిపాడు. ఓ వ్యక్తిని రైలు బండి కొట్టేసిందని అక్కడి వారు చెప్పడంతో తాము అతడిని దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే, ప్రచారంలో ఉన్న ఆనవాళ్లను బట్టి రాజు అని తెలిసిందని వివరించాడు. 8.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామని, హైదరాబాద్ వెళుతున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ కొట్టేసి ఉంటుందని తెలిపాడు.

మరో గ్యాంగ్ మన్ మాట్లాడుతూ, డెడ్ బాడీని గుర్తించిన తర్వాత 100కు డయల్ చేసి సమాచారం అందించామని వెల్లడించాడు. రాజుపై రివార్డు ఉండడంతో, డబ్బులు ఏమైనా వస్తాయేమోనని ఆశ అని పేర్కొన్నాడు. బాలికపై హత్యాచారానికి పాల్పడిన రాజు పరారీలో ఉండడంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించడం తెలిసిందే.