MS Dhoni: ధోనీ సారధ్యంలో ఐపీఎల్‌ను ఆస్వాదించా... ముత్తయ్య మురళీధరన్

Dhoni is brilliant captain says Muttaiah Muralidharan
  • 19 నుంచి ఐపీఎల్ రెండో సెషన్ ప్రారంభం
  • ధోనీ సారధ్యంలో ఆడిన రోజులు గుర్తు చేసుకున్న శ్రీలంక దిగ్గజం
  • ఆటగాళ్లందర్నీ అర్థం చేసుకుంటాడంటూ ధోనీకి ప్రశంస
టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీపై శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ నెల 19 నుంచి ఐపీఎల్ రెండో సెషన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను ధోనీ సారధ్యంలో ఐపీఎల్ ఆడిన రోజులను మురళీధరన్ గుర్తుచేసుకున్నాడు. ధోనీ అద్భుతమైన కెప్టెన్ అని కితాబునిచ్చాడు.

ఐపీఎల్ తొలి సీజన్ గురించి ఈ లెజెండరీ స్పిన్నర్ మాట్లాడాడు. ఆ టోర్నీలో చెన్నై జట్టు చాలా సార్లు 200పైచిలుకు పరుగులు చేసిందని, ఆ జట్టు సభ్యులే ఎక్కువ వికెట్లు కూడా పడగొట్టారని మురళీధరన్ చెప్పాడు. ఈ టోర్నీలో సారధిగా ధోనీ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని మెచ్చుకున్నాడు.

‘‘అప్పుడు జట్టులో చాలా మంది వారి వారి జాతీయ జట్లలో దిగ్గజాలు. వాళ్లందర్నీ ధోనీ అర్ధం చేసుకుంటాడు. దీంతో మంచి బలమైన జట్టును నిర్మించాడు. ధోనీ సారధ్యంలో ఐపీఎల్‌ను ఆస్వాదించా’’ అని మురళీధరన్ తెలిపాడు. తాను వికెట్లు తీయడానికి కాకుండా, పరుగులు కట్టడి చేయడానికే ప్రయత్నించానని అన్నాడు.
MS Dhoni
Muttaiah Muralidharan
IPL 2021
CSK

More Telugu News