పరువు కోసం బతికిన కోడెల ఆ పరువు కోసమే ప్రాణాలు కోల్పోయారు: చంద్రబాబు 

16-09-2021 Thu 17:41
  • నేడు కోడెల ద్వితీయ వర్ధంతి
  • సహచరుడికి ఘననివాళి అర్పించిన చంద్రబాబు
  • పల్నాటిపులిగా అభివర్ణించిన వైనం
  • ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని వ్యాఖ్యలు
Chandrababu pays rich tributes to Kodela Sivaprasad

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు రెండో వర్ధంతి సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు ఘననివాళులు అర్పించారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కోడెలను పల్నాటిపులిగా అభివర్ణించారు. చివరి వరకు పరువు కోసమే బతికిన కోడెల, చివరికి ఆ పరువు కోసమే ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. కోడెలది ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

ఎంతో ధైర్యశాలి అయిన కోడెల వంటి వ్యక్తి కూడా చివరికి ఆత్మస్థైర్యం కోల్పోయి ప్రాణాలు తీసుకునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. పల్నాటిపులి వంటి వ్యక్తిపై దారుణమైన ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా కోడెల బాటలో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం ఉదంతం అందుకు నిదర్శనమని తెలిపారు.