Justice Kanagaraj: జస్టిస్‌ కనగరాజ్ నియామకాన్ని 6 వారాల పాటు సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

  • జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని సవాల్ చేసిన న్యాయవాది పారా కిశోర్
  • నియామకం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని వాదన
  • వయసు రీత్యా కూడా ఆయనకు అర్హత లేదన్న కిశోర్
AP High Court suspends Justice Kanagaraj appontment

ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని ఏపీ హైకోర్టు ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది. జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని న్యాయవాది పారా కిశోర్ సవాల్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కనగరాజ్ ను నియమించారని తన ఫిర్యాదులో కిశోర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు.

ఈ నేపథ్యంలో కనగరాజ్ నియామక జీవోను 6 వారాల పాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

ఏపీ రాష్ట్ర స్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీ నిబంధన 4(ఏ)కు విరుద్ధంగా కనగరాజ్ ను నియమించారని తన పిటిషన్ లో పారా కిశోర్ తెలిపారు. రాజకీయ జోక్యం లేకుండా ఈ అథారిటీ వ్యవహరించాలని సుప్రీంకోర్టు తెలిపిందని చెప్పారు. ఛైర్మన్ గా నియమితులయ్యే వ్యక్తి చట్టప్రకారం 65 ఏళ్లు నిండే వరకే ఆ పదవిలో ఉండాలని... కానీ, కనగరాజ్ ప్రస్తుత వయసు 78 ఏళ్లని... వయసు రీత్యా ఆయనకు అర్హత లేదని తెలిపారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిఫారసు మేరకు కనగరాజ్ ను గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారని... ఈ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసిందని చెప్పారు. ఆ తర్వాత ఆయనను పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమించారని తెలిపారు. కనగరాజ్ తో ముఖ్యమంత్రికి ఉన్న సాన్నిహిత్యమే దీనికి కారణమని చెప్పారు. కనగరాజ్ నియామకానికి అనుగుణంగా నిబంధనలను సవరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ జీవో ఫైళ్లను కోర్టుకు తెప్పించి పరిశీలించాలని, జీవోను రద్దు చేయాలని కోరారు.

More Telugu News