కృత్రిమ గర్భధారణ కోసం అనేక మంది మహిళలకు సొంత వీర్యాన్ని ఉపయోగించిన అమెరికా వైద్యుడు!

16-09-2021 Thu 17:22
  • 1980వ దశకం నాటి ఘటన
  • ఓ మహిళకు సంతాన సాఫల్య చికిత్స చేసిన డాక్టర్ మోరిస్
  • వైద్య విద్యార్థి నుంచి వీర్యం సేకరించానని చెప్పిన డాక్టర్
  • ఓ కుమార్తెకు జన్మనిచ్చిన మహిళ
  • ఇప్పుడా కుమార్తె కోర్టును ఆశ్రయించిన వైనం
US doctor allegedly uses his own sperm for fertile his patients

సాధారణంగా కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఆరోగ్యవంతులైన దాతల నుంచి సేకరించిన వీర్యాన్ని వినియోగిస్తారు. కానీ అమెరికాలో మోరిస్ వోర్డ్ మన్ అనే సంతాన సాఫల్య వైద్య నిపుణుడు అందుకోసం సొంత వీర్యాన్ని ఉపయోగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. డాక్టర్ మోరిస్ వోర్డ్ మన్ 1980వ దశకంలో ఓ మహిళకు సంతాన సాఫల్య చికిత్స చేశారు. ఓ వైద్య విద్యార్థి నుంచి సేకరించిన వీర్యాన్ని గర్భధారణ కోసం ఉపయోగించానని ఆ మహిళకు డాక్టర్ మోరిస్ చెప్పారు. నాడు మోరిస్ చికిత్సతో తల్లైన మహిళకు ఓ కుమార్తె జన్మించింది. ఇప్పుడా కుమార్తె కోర్టుకెక్కింది.

నాడు మోరిస్ ఉపయోగించింది సొంత వీర్యం అని ఆమె ఆరోపిస్తోంది. డీఎన్ఏ పరీక్ష చేయించుకుంటే తనకు 9 మంది తోబుట్టువులు ఉన్నట్టు వెల్లడైందని, ఇది కచ్చితంగా డాక్టర్ మోరిస్ వీర్యమేనని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలని ఆమె అంటోంది. పలువురు మహిళలకు ఇలాగే సొంత వీర్యం ఇచ్చి గర్భధారణ చేశారని వెల్లడించారు. డాక్టర్ మోరిస్ చికిత్సతో జన్మించిన ఫిర్యాదిదారు ప్రస్తుతం ఆయన వద్దే గైనకాలజీ చికిత్స పొందుతుండడం గమనార్హం.

ఆమె ఆరోపణలపై డాక్టర్ మోరిస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గతంలో డొనాల్డ్ క్లైన్ అనే డాక్టర్ కూడా కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో సొంత వీర్యాన్ని ఉపయోగించి కోర్టు ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన లైసెన్స్ ను కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ మోరిస్ ఉదంతంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.