గుజరాత్ లో కొలువుదీరిన కొత్త కేబినెట్.. ప్రమాణస్వీకారం చేసిన 24 మంది మంత్రులు

16-09-2021 Thu 16:51
  • ఈరోజు రాజీనామా చేసిన స్పీకర్ రాజేంద్ర త్రివేదికి మంత్రి పదవి
  • కేబినెట్ మంత్రులుగా 10 మంది, సహాయ మంత్రులుగా 14 మంది ప్రమాణం
  • ప్రమాణస్వీకారానికి హాజరైన మాజీ సీఎం విజయ్ రూపానీ
New cabinet formed in Gujarat

గుజరాత్ లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో కొత్త మంత్రి వర్గం ఏర్పడింది. 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మాజీ సీఎం విజయ్ రూపానీ మంత్రివర్గంలోని మంత్రులకు ఈసారి చోటు దక్కకపోవడం విశేషం.

ఇక ఈరోజు అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర త్రివేదికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రమాణస్వీకారం చేసిన ఇతర నేతల్లో హృషికేశ్ పటేల్, జీతూ వఘానీ, రాఘవ్ జీ పటేల్, కానూభాయ్ దేశాయ్, కిరీట్ సింహ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్ సింహ్ చౌహాన్ ఉన్నారు.

24 మందిలో 10 మంది కేబినెట్ మంత్రులుగా, 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సహాయమంత్రుల్లో ఐదుగురికి స్వతంత్ర హోదా ఉండటం గమనార్హం. వీరందరి చేత రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా హాజరయ్యారు.