ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయిన బైడెన్!

16-09-2021 Thu 15:55
  • యూకే పీఎం, ఆసీస్ పీఎంతో వీడియో కాన్ఫరెన్స్
  • ముందుగా మాట్లాడిన స్కాట్ మారిసన్
  • ధన్యవాదాలు చెప్పే సమయంలో పేరు మర్చిపోయి తడబడ్డ బైడెన్
biden forgets australia prime minister name

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. న్యూక్లియర్ శక్తితో పనిచేసే జలాంతర్గాముల నిర్మాణం కోసం ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి బ్రిటన్, అమెరికా సహకారం అందించనున్నాయి. ఈ సహకారంపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు దేశాల అధినేతలు చర్చించారు.

ఈ సమయంలో తొలిగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మాట్లాడారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇద్దరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత బోరిస్ జాన్సన్ మాట్లాడారు. చివరగా బైడెన్ మాట్లాడతారని బోరిస్ చెప్పారు. దీంతో మాటలు ప్రారంభించిన బైడెన్.. యూకే ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

అదే సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయి తడబడ్డారు. ‘ఐ థ్యాంక్... దట్ ఫెల్లా డౌన్ దేర్’ (ఆ.. ఆ కింద ఉన్న వ్యక్తికి కూడా థాంక్యూ) అని అన్నారు. దీనికి స్పందించిన మారిసన్ తిరిగి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా బైడెన్ తడబడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.