Vijayashanti: ఈ రైతు బంధు సమితుల పరిస్థితి చూస్తే... ఒక్క అడుగు ముందుకు పడితే ఒట్టు: విజ‌య‌శాంతి

  • ఏ సమస్యకైనా చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారాలు చూపించట్లేదు 
  • కంటితుడుపు చర్యలతో తాత్కాలిక ఊరట కలిగిస్తున్నారు
  • ఆనక గాలికి వదిలేయడంలో ఈ పాలకులు సిద్ధహస్తులు
  • ఇందుకు నిలువెత్తు ఉదాహరణ 'రైతు బంధు సమితులు'
vijay shanti slams kcr

తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మండిప‌డ్డారు. 'తెలంగాణలో ఏ సమస్యకైనా చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారాలు చూపించడానికి బదులు... కంటితుడుపు చర్యలతో తాత్కాలిక ఊరట కలిగించి, ఆనక గాలికి వదిలేయడంలో ఈ పాలకులు సిద్ధహస్తులు. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ రైతు బంధు సమితులు' అని ఆమె పేర్కొన్నారు.

'ప్రస్తుతం వీటికి పట్టిన గతిపై మీడియాలో వచ్చిన పరిశోధనాత్మక కథనం చూస్తే తెలంగాణ సర్కారు తీరును ప్రజలందరూ అసహ్యించుకోవడం ఖాయం. రేయింబవళ్లు కష్టపడి రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర దక్కేలా వారి ఆదాయం పెంచేలా, పక్క రాష్ట్రాలు-విదేశాలకు ఎగుమతి చేసుకునేలా రైతుబంధు సమితులు అన్నదాతలకు అండగా ఉంటాయని గొప్ప గొప్ప కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. అంతే కాదు... పంటల బీమా గురించి అవగాహన కల్పించడం వ్యవసాయోత్పత్తుల నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్‌లకు సహకారం, ట్రేడింగ్ సెంటర్ల ఏర్పాటు... ఆహార పార్కులు, పరిశోధనలు, రైతులకు విజ్ఞానయాత్రలంటూ ఇంకా ఎన్నెన్నో చెప్పారు. నేడు ఈ రైతు బంధు సమితుల పరిస్థితి చూస్తే... ఒక్క అడుగు ముందుకు పడితే ఒట్టు' అని ఆమె అన్నారు.

'వీటిని ప్రారంభించినప్పుడు కేసీఆర్ గారు చెప్పిన రూ.200 కోట్ల కార్పస్‌ ఫండ్‌, పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఉద్దేశించిన రూ. 500 కోట్ల ఎమ్మెస్పీ ఫండ్స్ అతీగతీ లేదు. అంతెందుకు... 1.61 లక్షల మంది సభ్యులున్నట్టు చెబుతున్న ఈ సమితుల్లో నాలుగేళ్లుగా ఏ ఒక్కపనీ నడవకపోగా అద్దె, కరెంట్, టెలిఫోన్ బిల్స్ చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర కార్యాలయం ఉండటం ఇక్కడి ఘోరమైన పరిస్థితికి అద్దం పడుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రైతు వేదికలు దాదాపు నిరుపయోగంగా పడున్నాయి' అని విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు.

'రాష్ట్ర కమిటీ విషయానికి వస్తే చైర్మన్ తప్ప కమిటీ సభ్యులు కానరాని నిస్సహాయ పరిస్థితి వెక్కిరిస్తోంది. ఆర్భాటంగా మొదలు పెట్టిన ఈ రైతు బంధు సమితుల మార్గంలోనే రేపు దళిత బంధును కూడా తీసుకెళతారనడంలో ఎలాంటి సందేహం లేదు' అని ఆమె అన్నారు.

More Telugu News