దేశ నిర్మాణంలో తెలంగాణది నాలుగో స్థానం.. ఆర్బీఐ నివేదికపై కేటీఆర్​ హర్షం

16-09-2021 Thu 12:07
  • ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా రూ.8,10,503 కోట్లు
  • వాటాలో నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా అవతరణ
  • కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోందన్న కేటీఆర్
KTR Expresses Gratitude On RBI Report

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రాష్ట్రం నాలుగో అతిపెద్ద కంట్రిబ్యూటర్ గా ఉందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదికపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని అన్నారు. జనాభా విషయంలో 12వ స్థానంలో, భౌగోళికంగా రాష్ట్రం 11వ స్థానంలో ఉందని పేర్కొన్న కేటీఆర్.. దేశ నిర్మాణంలో 4వ స్థానంలో ఉందన్నారు.

రాష్ట్రం అధోగతి పాలవుతోందంటున్న వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు అదిచ్చాం.. ఇదిచ్చాం అన్న మాటలు వినివినీ విసిగిపోయామన్నారు. ఇచ్చింది ఏదైనా ఉందంటే అది దేశానికి తెలంగాణనే ఇచ్చిందన్నారు. దేశం కోసం తమ వంతు భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వపడుతున్నామని కేటీఆర్ అన్నారు.

కాగా, 2020–21కి సంబంధించి భారత ఆర్థిక పరిస్థితిపై నిన్న ఆర్బీఐ హ్యాండ్ బుక్ ను విడుదల చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం దేశ ఆర్థిక నిర్మాణంలో రాష్ట్రాల వాటాకు సంబంధించి నెట్ స్టేట్ వాల్యూ యాడెడ్ (ఎన్ఎస్వీఏ) వివరాలను వెల్లడించింది. దాని ప్రకారం 2014–15లో రూ.4,16,930 కోట్లుగా ఉన్న తెలంగాణ ఎన్ఎస్వీఏ.. ఇప్పుడు రూ.8,10,503 కోట్లకు పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. తెలంగాణ కన్నా ముందు తమిళనాడు (రూ.15,44,935 కోట్లు), కర్ణాటక (రూ.13,40,350 కోట్లు), పశ్చిమ బెంగాల్ (రూ.11,04,866 కోట్లు) ఉన్నాయని వివరించింది.