సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు మృత‌దేహం పోలీసులకు ఇలా ల‌భ్య‌మైంది!

16-09-2021 Thu 11:36
  • ఎన్‌కౌంట‌ర్ భ‌యంతో వ‌ణికిపోయిన రాజు
  • ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడ‌ని ముందుగానే భావించిన పోలీసులు
  • ఆ అనుమానంతో రైల్వే ప్ర‌మాదాల మృత‌దేహాల ప‌రిశీలన‌
  • చివ‌ర‌కు రైల్వే ట్రాక్‌పై రాజు మృత‌దేహం గుర్తింపు
  • రాజు భార్య పేరు మౌనిక‌.. అత‌డి చేతులపై ఈ పేరే ప‌చ్చ‌బొట్లు
how police finds raju dead body
హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌, సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్ప‌డి ఏడు రోజులుగా క‌న‌ప‌డ‌కుండా పోయిన‌ నిందితుడు రాజు రైలు కిందపడి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. రైల్వే ట్రాక్‌పై గుర్తించింది రాజు మృత‌దేహమేన‌ని పోలీసులు నిర్ధారించారు. అంత‌కు ముందు రాజు ఆచూకీ కోసం పోలీసులు వేలాది సీసీ కెమెరాలను ప‌రిశీలించారు.

ప్ర‌తి ప్రాంతాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు. తెలంగాణ అంత‌టా జ‌ల్లెడ ప‌ట్టారు. రాజును ఎన్‌కౌంట‌ర్ చేయాల్సిందేనంటూ పౌర స‌మాజం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావ‌డంతో నిందితుడు భ‌య‌ప‌డిపోయి ఉంటాడ‌ని పోలీసులు ముందుగానే అంచ‌నా వేశారు. దీంతో అత‌డు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డే అవ‌కాశాలు కూడా ఉండ‌డంతో రైల్వే ట్రాక్‌ల‌పై కూడా పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు.

నిన్న రాజు ఉప్పల్ ప‌రిస‌ర‌ ప్రాంతాల్లో సంచ‌రించిన‌ట్లు గుర్తించారు. అలాగే, ఇటీవ‌ల‌ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లు, ఆత్మ‌హ‌త్య‌ల్లో గుర్తు తెలియని మృతుల వివరాల‌ను కూడా పోలీసులు సేక‌రించారు. అంతేగాక‌, మార్చురీల్లో భ‌ద్ర‌ప‌రిచిన రైలు ప్ర‌మాద మృత‌దేహాల‌ను ప‌రిశీలించారు.

మార్చురీల్లో రాజు మృత‌దేహం ల‌భ్యం కాలేదు. చివ‌ర‌కు పోలీసులు భావించినట్లే రాజు రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ రైల్వే ట్రాక్‌పై ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు రైల్వే ట్రాక్ వ‌ద్ద‌కు వ‌చ్చి ప‌రిశీలించ‌గా అత‌డి ముఖం మొత్తం ఛిద్ర‌మైక‌న‌ప‌డింది.

అత‌డి చేతుల‌పై చూడ‌గా 'మౌనిక' అనే ప‌చ్చ‌బొట్లు ఉన్నాయి. రాజును గుర్తించ‌డానికి ఇదే ప్ర‌ధాన ఆధారంగా ముందు నుంచీ పోలీసులు భావిస్తున్నారు. రాజు భార్య పేరు మౌనిక‌. గ‌తంలో ఆయ‌న రెండు చేతుల‌పై మౌనిక పేరును ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నాడు. తాను ఇక పోలీసుల నుంచి త‌ప్పించుకోలేన‌ని గ్ర‌హించిన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. రాజు సెల్‌ఫోన్ వాడ‌క‌పోవ‌డం వ‌ల్లే అత‌డిని గుర్తించ‌డం ఆలస్య‌మైంది.