Andhra Pradesh: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు.. ఓట్ల లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్!

  • ఈ ఏడాది ఏప్రిల్ 8న రాష్ట్రంలో ఎన్నికలు  
  • మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి
  •  సవాల్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • సింగిల్ జడ్జి తీర్పు కొట్టివేత
AP High Court Clears The Obstacles For MPTC and ZPTC Election Counting

గతంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టవచ్చని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ జె. ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పును చెప్పింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది.

ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఈ ఏడాది ఏప్రిల్ 8న రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందే ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చిన వారానికే ఎన్నికలు నిర్వహించారంటూ గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు మే 21న ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు జరపాలని ఆదేశించింది.

అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు నేతలు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు జరపడమంటే కష్టసాధ్యమైనదని, కోట్లాది రూపాయలు వృథా అవుతాయని కోర్టుకు ఎస్ఈసీ వివరించింది. ఆ అప్పీళ్లపై గత నెల 5న విచారించిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఓట్లను లెక్కించవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓట్ల కౌంటింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకునేందుకు కసరత్తులను మొదలుపెట్టింది.

More Telugu News