ఇన్‌స్టా వీడియోతో ఇబ్బందులు.. యువతికి పోలీసుల నోటీస్!

15-09-2021 Wed 20:26
  • ఇండోర్‌ బిజీ రోడ్డుపై డ్యాన్స్ చేసిన యువతి
  • అంతకుముందు మాస్కు లేకుండా ఒక వీడియో
  • సోషల్ మీడియాలో వైరలైన వీడియో
Woman In Trouble For Dancing On Road For Instagram Video

బిజీ రోడ్డుపై సిగ్నల్ పడగానే ఎవరైనా వేగంగా రోడ్డు క్రాస్ చేస్తారు. కానీ ఆ యువతి మాత్రం రోడ్డు మధ్యలో నిలబడి డ్యాన్స్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం కోసమే సదరు యువతి ఇలా చేసింది. అయితే ఆమె ప్రవర్తన నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.

శ్రేయా కల్రా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఇంతకు ముందు ఒక కూడలిలో మాస్కు లేకుండా మాట్లాడుతున్న వీడియో ఒకటి చేసిందామె. దానిపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇలా రోడ్డుపై ఆమె డ్యాన్స్ చేయడాన్ని కూడా కొందరు తప్పుబట్టారు. పోలీసులు కూడా ఈ విషయం తెలిసి ఆమెకు నోటీసులు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదంటూ పోలీసులు తమ నోటీసులో ఆరోపించారు.

ఈ వీడియోపై స్పందించిన శ్రేయ.. తన ఫాలోవర్లంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని కోరింది. ‘‘నిబంధనను ఉల్లంఘించకండి. రెడ్ సిగ్నల్ అంటే మనం ఆగాలి. నేను డ్యాన్స్ చేస్తున్నందుకు కాదు’’ అంటూ ఆమె ఒక పోస్టు పెట్టింది.