చంద్రబాబు ఆ పని చేసుంటే.. ఆ భారం అక్కడితో పోయేది: సీఎం జగన్

15-09-2021 Wed 19:14
  • రుణమాఫీ చేయకుండా అక్కాచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు
  • చంద్రబాబు వల్ల ఏ గ్రేడ్ లో ఉన్న డ్వాక్రా సంఘాలు సీ గ్రేడ్ లోకి వెళ్లాయి
  • సున్నా వడ్డీ రుణాలను మళ్లీ పునరుజ్జీవింపజేశాం
Jagan fires on Chandrababu

అక్కాచెల్లెమ్మలను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టొద్దని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పిందని... దీంతో అక్కచెల్లెమ్మలు రుణాలు చెల్లించలేదని... చివరకు రుణభారం పెరిగిపోయి వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ రుణాలను నాలుగు దఫాలుగా తమ ప్రభుత్వమే చెల్లిస్తోందని చెప్పారు.

2014లో అక్కాచెల్లెమ్మల రుణాలను చంద్రబాబు మాఫీ చేసి ఉంటే ఆ భారం అక్కడితో పోయేదని అన్నారు. మహిళలను చంద్రబాబు ఆదుకోలేదని... చివరకు మొత్తం వ్యవస్థ ఛిన్నాభిన్నమయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు వల్ల ఏ గ్రేడ్ లో ఉన్న ద్వాక్రా సంఘాలన్నీ సీ గ్రేడ్ లోకి పడిపోయాయని విమర్శించారు. వైయస్సార్ చేనేత, ఆసరా పథకాలపై ఈరోజు జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మహిళలను ఆదుకోవాలనే ఆసరా, చేయూత కార్యక్రమాలను తీసుకొచ్చామని జగన్ చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. తొలి విడత ఆసరా కింద 8 లక్షలకు పైగా డ్వాక్రా గ్రూపులకు రూ. 6,330.58 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రెండో విడత ఆసరాకు సన్నాహకాలు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించామని తెలిపారు.

2016లో రద్దయిన సున్నా వడ్డీ రుణాలను పునరుజ్జీవింపజేశామని జగన్ చెప్పారు. మహిళలను ఆదుకోవడమే కాకుండా రిలయన్స్, అమూల్, ఐటీసీ వంటి కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించామని తెలిపారు. మరోవైపు ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, సెర్ప్ ఎండీ ఇంతియాజ్, తదితరులు హాజరయ్యారు.