గంగూలీ, ధోనీలలో బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన సెహ్వాగ్

15-09-2021 Wed 16:46
  • ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాజీ ఓపెనర్
  • క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గంగూలీ ఏకతాటిపైకి తెచ్చారు
  • ధోనీకి సమస్యలు ఎదురవ్వలేదన్న సెహ్వాగ్  
Sehwag picks best captain between Ganguly and Dhoni

భారత క్రికెట్ జట్టును ప్రపంచంలో బలమైన జట్లలో ఒకటిగా నిలబెట్టిన సారధుల్లో మాజీలు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ ముఖ్యులు. వీరిద్దరి వల్లే భారత క్రికెట్ కొత్త పుంతలు తొక్కిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే వీరిద్దరిలో ఎవరు ఉత్తమ సారధి అంటే మాత్రం చెప్పడం కష్టం. ఇదే ప్రశ్న భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్‌కు ఎదురైంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సెహ్వాగ్.. ఈ ప్రశ్నకు బదులిచ్చాడు. తన దృష్టిలో గంగూలీ, ధోనీ ఇద్దరూ ప్రత్యేకమైన సారధులేనని అన్నాడు. జట్టు కష్టాలు ఎదుర్కుంటున్న సమయంలో గంగూలీ ఉత్తమ సారధిగా నిలిచాడని, జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చాడని కొనియాడాడు. విదేశాల్లో ఎలా గెలవాలో జట్టుకు రుచి చూపించింది గంగూలీనే అని తెలిపాడు.

ఇక ధోనీ కెప్టెన్ అయ్యే సమయానికి భారత్ గొప్ప క్రికెట్ జట్టుగా ఉందని సెహ్వాగ్ తెలియజేశాడు. దీంతో కొత్త జట్టును తయారు చేయడంలో ధోనీకి సమస్యలు ఎదురవ్వలేదని చెప్పాడు. అయితే వీరిద్దరూ గొప్ప సారధులని కితాబునిచ్చాడు. వ్యక్తిగతంగా మాత్రం గంగూలీనే అత్యుత్తమ సారధి అని అభిప్రాయపడ్డాడు.