భారీ షాట్ ఆడిన క్రిస్ గేల్.. విరిగిపోయిన బ్యాట్

15-09-2021 Wed 15:16
  • సీపీఎల్ 2021 టోర్నీలో జరిగిన ఘటన
  • గయానా అమెజాన్ వారియర్స్, సెంట్ కిట్స్ మధ్య మ్యాచ్
  • కొత్త బ్యాట్ తెప్పించుకొని ఆట కొనసాగించిన గేల్ 
Chris Gayle bat broken while playing

విండీస్ విధ్వంసం క్రిస్ గేల్‌ ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటుంది. తాజాగా అతని చేతిలో బ్యాట్ విరిగిపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. సీపీఎల్ 2021 టోర్నీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. గయానా అమెజాన్ వారియర్స్, సెంట్ కిట్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. గేల్ బ్యాట్ విరిగింది.

ఒడియన్ స్మిత్ అనే బౌలర్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌‌లో గేల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒడియన్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ భారీ షాట్ ఆడటానికి గేల్ ప్రయత్నించాడు. ఆ సమయంలో బ్యాటును బంతి బలంగా తాకింది. దీంతో అతని చేతిలోని బ్యాట్ రెండు ముక్కలైంది. హ్యాండిల్ మాత్రం గేల్ చేతిలో మిగిలింది. చేతిలో విరిగిపోయిన బ్యాట్‌ను పరిశీలించిన గేల్.. కొత్త బ్యాట్ తెప్పించుకొని ఆట కొనసాగించాడు.