'మెట్‌గాలా' ఈవెంట్‌లో తళుక్కుమన్న మేఘా కృష్ణారెడ్డి భార్య.. భారత్ నుంచి ఆమె ఒక్కరే!

15-09-2021 Wed 08:48
  • ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిసిన సుధారెడ్డి
  • గౌను తయారీకి 250 గంటలు
  • ఈ ఏడాది థీమ్‌కు అనుగుణంగా డ్రెస్ డిజైన్
Megha Krishna Reddy wife Sudha Reddy at Met Gala Event

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణా రెడ్డి భార్య సుధారెడ్డి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై తళుక్కుమన్నారు. న్యూయార్క్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన ‘మెట్ గాలా-2021’లో తళుక్కుమన్న సుధారెడ్డి ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు.

ఈ ఏడాది థీమ్ అయిన ‘అమెరికన్ ఇండిపెండెన్స్’కు తగ్గట్టుగా అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ డిజైనర్లు తీర్చిదిద్దిన గౌనును సుధారెడ్డి ధరించారు. ఈ గౌను తయారీకి ఏకంగా 250 గంటలు పట్టింది. గతంలో బాలీవుడ్ మహిళా నటులు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొనగా, ఈ ఏడాది భారత్‌ నుంచి పాల్గొన్నది మాత్రం సుధారెడ్డి ఒక్కరే. అంతేకాదు, మెట్ గాలాలో పాల్గొనడం ఆమెకు ఇదే తొలిసారి కూడా.