Maoist: రూ. 20 లక్షల రివార్డు ఉన్న తెలంగాణ మావోయిస్టు కీలక నేత శంకర్ అరెస్ట్

Telangana Maoist leader dubasi Shankar arrested in Odisha
  • అరెస్ట్ చేశామన్న ఒడిశా డీజీపీ అభయ్
  • రైఫిల్, బులెట్లు, రూ. 35 వేల నగదు స్వాధీనం
  • 1987లో మావోయిస్టుల్లో చేరి అంచెలంచెలుగా ఎదిన శంకర్
  • పలు ఎన్‌కౌంటర్లలో శంకర్ పాత్ర
తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్, అలియాస్ మహేందర్, అలియాస్ అరుణ్, అలియాస్ రమేశ్ పోలీసులకు చిక్కాడు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కొరాపుట్, మల్కాన్‌గిరి, విశాఖపట్టణం జిల్లాల్లో మావోయిస్టు కీలక నేతగా ఉన్న శంకర్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్టు ఒడిశా డీజీపీ అభయ్ నిన్న తెలిపారు.

 కూంబింగ్‌లో భాగంగా నోయరో గ్రామంలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అతడి నుంచి ఇన్సాస్ రైఫిల్, 10 రౌండ్ల బులెట్లు, ఇతర సామగ్రి, రూ. 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, శంకర్ తలపై రూ. 20 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు డీజీపీ తెలిపారు.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్ 1987 నుంచే తీవ్రవాద ఉద్యమంలో ఉన్నాడు. 2016లో చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన భార్య భారతక్క మృతి చెందారు.  విశాఖపట్టణం జిల్లా తీగలమెట్టలో ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో అతడి హస్తం ఉన్నట్టు డీజీపీ తెలిపారు.

అలాగే, 2010లో గోవిందపల్లిలో మందుపాతర పేల్చి 11 మంది ఒడిశా పోలీసులను హతమార్చిన ఘటనలోను, చిత్రకొండలోని జానిగూడ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు బీఎస్ఎప్ జవాన్లు మరణించిన ఘటనలోను శంకర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 2003 నాటికి మావోయిస్టు ఎస్‌జడ్‌సీ సభ్యుడి స్థాయికి ఎదిగిన శంకర్‌పై ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో 24 కేసులు నమోదైనట్టు చెప్పారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు నేతలు దుబాసి శంకర్, కిరణ్‌లను వెంటనే విడిచిపెట్టాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.
Maoist
Dubasi Shankar
Telangana
Odisha
Arrest

More Telugu News