Apple: అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఐఫోన్ 13.. అద్భుత డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లు

  • ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీలను విడుదల చేసిన యాపిల్
  • నాచ్‌ను తగ్గించి డిస్‌ప్లే ఏరియాను పెంచిన టెక్ దిగ్గజం
  • ఎ15 బయోనిక్ చిప్‌సెట్‌తో 50 శాతం అధిక వేగం
  • 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే
Apple iPhone 13 with redesigned camera array smaller notch unveiled

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13లను టెక్ దిగ్గజం నిన్న విడుదల చేసింది. కొద్దిపాటి నాచ్ కలిగి ఉన్న ఈ ఫోన్లలో రియర్ కెమెరాల సెటప్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. ఐఫోన్ 13ను 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో విడుదల చేసింది. పింక్, బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్, రెడ్ రంగుల్లో ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. 128 జీబీ స్టోరేజీ కలిగిన వేరియంట్ ధర రూ. 799 డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు 60 వేల రూపాయలన్న మాట.

ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీలో డిస్‌ప్లే ఏరియాను పెంచేందుకు నాచ్‌ను చిన్నగానే ఏర్పాటు చేశారు. గత ఫోన్లతో పోలిస్తే 20 శాతం తక్కువగా నాచ్‌ను డిజైన్ చేశారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఐఫోన్ 13లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను ఉపయోగించారు. దీనివల్ల బ్రైట్‌నెస్ 28 శాతం అధికంగా ఉంటుంది. ఎ15 బయోనిక్ చిప్‌సెట్ వాడారు. ఫలితంగా ప్రత్యర్థుల ఫోన్లతో పోలిస్తే ఇది 50 శాతం వేగంగా ఉంటుందని యాపిల్ పేర్కొంది. అలాగే, గ్రాఫికల్ పెర్ఫార్మెన్స్ కూడా 30 శాతం మెరుగ్గా ఉంటుందని తెలిపింది. ఇందులో 13 టచ్ ఐడీకి సపోర్ట్ చేస్తుంది. ఫేస్ ఐడీని కూడా జోడించారు.

కెమెరా విషయానికొస్తే 12 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు రెండు కెమెరాలు ఉపయోగించారు. ఇందులోని అల్ట్రా వైడ్ లెన్స్ 120 డిగ్రీ ఫీల్డ్ వ్యూను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరాలో సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ ఉంది. అలాగే, వెనకవైపు కెమెరాలను డయాగ్నల్ (ఐమూల)గా ఏర్పాటు చేశారు. సినిమాటిక్ మోడ్‌ను కూడా జోడించారు. ఐఫోన్ 13లో మరింత పెద్ద బ్యాటరీని ఉపయోగించినట్టు యాపిల్ పేర్కొంది.

More Telugu News