సరదాగా గాలం వేస్తే రూ.2.5 లక్షల విలువైన చేప దొరికింది!

14-09-2021 Tue 21:52
  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • పి.గన్నవరం వద్ద గోదావరిలో గాలం వేసిన వ్యక్తి
  • గాలానికి చిక్కుకున్న భారీ అలుగు చేప
  • 3 అడుగుల పొడవు, 10 కిలోల బరువున్న చేప
Fish garners lakhs of rupees in East Godavari

నదులు అనేక రకాల మత్స్యజాతులకు ఆవాసంగా ఉంటాయి. కొన్నిసార్లు నదుల్లోకి సముద్రాల నుంచి కూడా చేపలు వలస వస్తుంటాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి సరదాగా గాలం వేస్తే అరుదైన మీనం చిక్కుకుంది. పి.గన్నవరం వద్ద గోదావరి నదిపై ఉన్న ఆక్విడెక్ట్ వద్ద సాయంత్రం వేళ కాలక్షేపం కోసం గాలం వేయగా భారీ అలుగు చేప పడింది.

3 అడుగుల పొడవు, 10 కిలోల బరువున్న ఆ చేపను అమ్మకానికి పెట్టగా ఏకంగా రూ.2.5 లక్షల ధర పలికింది. ఇలాంటి చేపలు వలలకు పడుతుంటాయని, కానీ గాలానికి చిక్కుకోవడం చాలా అరుదు అని స్థానిక మత్స్యకారులు తెలిపారు. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో భారీ చేపలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తుంటాయని వివరించారు.