Narendra Modi: ‘మోదీ ఇచ్చారనుకున్నా’.. ఖాతాలో పడిన 5.5 లక్షలు ఖర్చుపెట్టేసిన వ్యక్తి!

  • బిహార్ వ్యక్తి ఖాతాలో పొరపాటున పడిన డబ్బు
  • బ్యాంకు అధికారులు ఫోన్ చేసినా తిరిగివ్వని వ్యక్తి
  • మేనేజర్ ఫిర్యాదుతో అరెస్టు చేసిన పోలీసులు
man refuses to return wrongfully credited funds

బ్యాంకు అధికారుల పొరపాటుతో ఒక వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. దీన్ని గుర్తించిన అధికారులు సదరు వ్యక్తికి ఫోన్ చేసి ఆ డబ్బును తిరిగిచ్చేయాలని అడిగారు. అయితే ఆ సొమ్మును ప్రధాని మోదీ నుంచి వచ్చిందనుకొని ఖర్చు పెట్టేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. ప్రస్తుతం తన ఖాతాలో డబ్బు లేదని, ఆ సొమ్ము తిరిగివ్వలేనని తేల్చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్‌లోని ఖగారియా ప్రాంతంలో జరిగింది.

స్థానికంగా ఉన్న గ్రామీణ బ్యాంకులో జరిగిన చిన్న పొరపాటుతో.. ఈ ఏడాది మార్చి నెలలో రంజిత్ దాస్ అనే వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షల రూపాయలు జమయ్యాయి. తర్వాత తీరిగ్గా తమ పొరపాటును గుర్తించిన బ్యాంకు అధికారులు.. ఈ సొమ్మును తిరిగిచ్చేయాలని రంజిత్‌ను అడిగారు.

‘‘ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తారని వార్తలొచ్చాయి. నా ఖాతాలో పడిన డబ్బు దానిలో మొదటి విడత ఇన్‌స్టాల్‌మెంట్ అనుకున్నా. ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు’’ అని రంజిత్ చెప్పాడు. బ్యాంకు మేనేజర్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News