ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మడం మంచి విధానం: సీపీఐ నారాయణ

14-09-2021 Tue 19:50
  • ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకం
  • ఏపీ ప్రభుత్వ నిర్ణయం
  • స్వాగతించిన సీపీఐ నారాయణ
  • తెలంగాణలోనూ ఇలాగే చేయాలని వ్యాఖ్యలు
CPI Narayana welcomes AP Govt decision of online ticketing for cinemas

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలని నిర్ణయించిన తర్వాత విపక్షాల నుంచి తొలిసారిగా సానుకూల స్పందన వచ్చింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం చెబుతోందని, ఇది మంచి పద్ధతి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సినిమా నిర్మాతలు దోపిడీ చేస్తున్నారని, ఒక్కో ఏరియాలో ఒక్కో రేటు ఉంటోందని ఆరోపించారు.

ఆన్ లైన్లో టికెట్లు విక్రయించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, తెలంగాణలోనూ ఇదే విధానంలో సినిమా టికెట్లు విక్రయించాలని నారాయణ అన్నారు. కాగా, సినిమా టికెట్లు, ఇతర సినీ రంగ సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ బృందం త్వరలోనే ఏపీ సీఎం జగన్ తో భేటీ కానుంది.