రక్తపుమడుగులో ​జాతీయ ఖోఖో క్రీడాకారిణి... అత్యాచార యత్నం.. హత్య!

14-09-2021 Tue 19:10
  • యూపీలో ఘోరం
  • రైలు పట్టాలపై శవమై తేలిన యువతి
  • ఇంటర్వ్యూకి వెళ్లి వస్తుండగా ఘటన
  • రైల్వే కూలీ అరెస్ట్
  • ఆడియో క్లిప్పింగ్ ఆధారంగా దర్యాప్తు
Kho Kho player killed by labour in Bijnor railway station

ఉత్తరప్రదేశ్ ఓ జాతీయ ఖోఖో క్రీడాకారిణిని దారుణ రీతిలో హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 24 ఏళ్ల ఆ క్రీడాకారిణి బిజ్నోర్ రైల్వే స్టేషన్ లో శవమై కనిపించింది.

పోలీసుల కథనం ప్రకారం... సెప్టెంబరు 10న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈ యువతి ఓ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లి ఇంటికి తిరిగివెళ్లే క్రమంలో బిజ్నోర్ రైల్వే స్టేషన్ కు వచ్చింది. అక్కడ షాజాద్ అలియాస్ హమీద్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. ఆ ఖోఖో క్రీడాకారిణి ఒంటరిగా ఉండడంతో ఆమెపై కన్నేసిన హమీద్... ఆమెను సిమెంటు స్లీపర్ల చాటుకు లాక్కెళ్లాడు.

ఆ సమయంలో ఆమె ఓ ఫ్రెండ్ తో ఫోన్ కాల్ మాట్లాడుతుండగా, ఆమె కేకలు అవతలి వ్యక్తికి కూడా వినిపించాయి. కొంచెం సేపటి తర్వాత ఆమె అరుపులు ఆగిపోయాయి. ఆమె ప్రతిఘటించడంతో హమీద్ ఆమె మెడకు దుపట్టా బిగించి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆపై, నిందితుడు ఆమె మొబైల్ ఫోన్ తో పరారయ్యాడని తెలిపారు.

సిమెంటు స్లీపర్ల చాటున రక్తపుమడుగులో పడి ఉన్న ఆ యువతిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు పాల్పడిన హమీద్ ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ చేశాడు. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి చొక్కాపై రక్తపు మరకలు పడగా, వాటిని అతడి భార్య ఉతికి శుభ్రం చేసినట్టు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఓ చెప్పు, రెండు చొక్కా గుండీలు లభ్యమయ్యాయి. కాగా, ఆమె ఫ్రెండ్ ఫోన్ కాల్ ఆడియో క్లిప్పింగ్ ను పోలీసులకు అందజేయడం కేసు విచారణలో ఎంతో ఉపకరించింది. నిందితుడు మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడని, అతడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.