ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మాలని చెప్పింది సినీ పెద్దలే: మంత్రి పేర్ని నాని

14-09-2021 Tue 18:49
  • సినిమా టికెట్లను అమ్మాలనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు
  • ప్రభుత్వం ఏ మంచి పని చేయాలనుకున్నా విషం చిమ్ముతున్నారు
  • సినీ పెద్దలతో సీఎం జగన్ భేటీ అవుతారు
Film industry big heads asked to sell tickets online says Perni Nani

సినిమా టికెట్లను ఆన్ లైన్లో అమ్మేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోర్టల్ ను సిద్ధం చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై ఇండస్ట్రీకి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మాలనే అంశంపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ అంశంపై కమిటీలు వేశామని... దీనిపై ఇంకా అధ్యయనం కొనసాగుతోందని అన్నారు.
 
ఈ విషయంపై కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... దుష్ప్రచారాలు చేయవద్దని అందరినీ కోరుతున్నామని పేర్ని నాని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి పని చేయాలనుకున్నా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
 
ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మాలని సినిమా ప్రముఖులే కోరారని... వారి సూచనలను ప్రభుత్వం పరిశీలించిందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. బ్లాక్ టికెట్లను అరికట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని చెప్పారు. కొందరు పన్నులు ఎగవేస్తున్నారనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చిందని అన్నారు. సినీ పరిశ్రమ పెద్దలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అవుతారని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు.