Lasith Malinga: అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ

  • ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్
  • తాజా నిర్ణయంతో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై
  • శ్రీలంక క్రికెట్లో ప్రతిభావంతుడైన బౌలర్ గా గుర్తింపు
  • ఇటీవలే ఫ్రాంచైజీ క్రికెట్ కు కూడా వీడ్కోలు
Sri Lanka pace legend Lasith Malinga says good bye to all forms of cricket

శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగ తాజాగా అంతర్జాతీయ టీ20 పోటీలకు వీడ్కోలు పలికాడు. మలింగ ఇదివరకే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నాడు. ఈ మేరకు మలింగ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు.

యార్కర్ల స్పెషలిస్ట్ గా పేరుగాంచిన మలింగ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఐదు హ్యాట్రిక్ లు నమోదు చేసిన ఒకే ఒక్క బౌలర్ మలింగానే. అంతేకాదు, వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లను రెండుసార్లు పడగొట్టిన రికార్డు కూడా మలింగ పేరిటే నమోదై ఉంది. ఐపీఎల్ లో మలింగ ఇప్పటికీ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.

మలింగ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ఓసారి పరిశీలిస్తే... 84 టీ20 మ్యాచ్ లు ఆడి 20.79 సగటుతో 107 వికెట్లు తీశాడు. 228 వన్డేల్లో 338 వికెట్లు తీసిన మలింగ, 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు, మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.

కాగా, అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న మలింగ... ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా ఇంతకుముందే తప్పుకున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో మలింగ ఐపీఎల్, బిగ్ బాష్ వంటి పేరుమోసిన లీగ్ ల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు మలింగ అనేక చిరస్మరణీయ విజయాలు అందించాడు.

లంక క్రికెట్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం... మలింగ అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు కెప్టెన్సీని ఆశించాడు. అయితే, సెలెక్టర్ల నుంచి సానుకూల స్పందన రాకపోవడం, లంక క్రికెట్ బోర్డు యువకులకు పెద్దపీట వేస్తుండడం వంటి కారణాలతో ఇక తప్పుకోవడమే మేలని మలింగ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News