లక్షన్నర జీతం వచ్చే విజయసాయిరెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఎలా వచ్చారు?: రఘురామకృష్ణరాజు

14-09-2021 Tue 17:21
  • ప్రత్యేక విమానంలో రావాలంటే రూ. 15 లక్షలు అవుతుంది
  • ఈ విషయంపై జగన్ ఆలోచించాలి
  • భారీ ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టినప్పుడు ఏపీ ఆఖరి స్థానంలో ఎందుకుంది?
How did Vijayasai Reddy came to Delhi in special flight asks Raghu Rama Krishna Raju

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. సాదాసీదా జీవితం గడుపుతున్నానని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి ఈరోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చినట్టు తెలిసిందని ఆయన అన్నారు.

సొంత డబ్బులతో ఢిల్లీకి ప్రత్యేక విమానంలో రావాలంటే రూ. 15 లక్షలు ఖర్చవుతుందని... విజయసాయికి అంత డబ్బు ఎవరు కట్టారని ప్రశ్నించారు. విజయసాయికి నెలకు లక్షన్నర రూపాయల జీతం వస్తుందని... అలాంటి వ్యక్తి ప్రత్యేక విమానాల్లో ఎలా ప్రయాణించగలరని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం విజయసాయిని ప్రత్యేక విమానంలో పంపించిందా? అని అడిగారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలని చెప్పారు.
 
కరోనా వ్యాక్సిన్లు వేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై రఘురాజు విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టామని విజయసాయి చెబుతున్నారని... మరి, అంత భారీ ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టినప్పుడు జాబితాలో ఏపీ ఆఖరి స్థానంలో ఎందుకుందని ఎద్దేవా చేశారు.