'రోడ్ల మీద ఇసుక'పై దృష్టిసారించిన జీహెచ్ఎంసీ... అరబిందో కన్ స్ట్రక్షన్స్ కు రూ.1 లక్ష జరిమానా

14-09-2021 Tue 15:14
  • ఇటీవల సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం
  • రోడ్డుపై ఇసుక ఉండడంతో కిందపడిన బైక్
  • సాయితేజ్ కు తీవ్ర గాయాలు
  • రోడ్లను తనిఖీ చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
GHMC fines a constructions company

హీరో సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి రోడ్డుపై ఉన్న ఇసుక కారణమని తేలడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో రోడ్లపై ఇసుక, మట్టి వంటివి ఉంటే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో మాదాపూర్-ఖానామెట్ రోడ్డుపై ఇసుక, ఇతర భవన నిర్మాణ మెటీరియల్ ఉండడాన్ని గుర్తించారు. అందుకు అరబిందో కన్ స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యురాలంటూ రూ.1 లక్ష జరిమానా వేశారు. ఖానామెట్ లో ఓ భవన సముదాయాన్ని నిర్మిస్తున్న అరబిందో కన్ స్ట్రక్షన్స్ భవన నిర్మాణ మెటీరియల్ ను రోడ్డుపై నిర్లక్ష్యంగా వదిలేసిందంటూ జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

అయితే, సాయితేజ్ యాక్సిడెంట్ ఘటనలోనే అరబిందో కన్ స్ట్రక్షన్స్ కు ఈ పెనాల్టీ విధించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా, జీహెచ్ఎంసీ వర్గాలు ఆ వార్తలను ఖండించాయి. సాయితేజ్ ప్రమాదానికి, అరబిందో కన్ స్ట్రక్షన్స్ కు ఎలాంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ (చందానగర్) ఎన్.సుధాంశ్ వెల్లడించారు. రోడ్లపై భవన నిర్మాణ మెటీరియల్ ను వదిలేయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా పరిణమిస్తోందని పేర్కొన్నారు.