నా కళ్ల ముందే నువ్వు హీరోగా ఎదిగావు.. శ్రీకాంత్ పై మండిపడ్డ నరేశ్!

14-09-2021 Tue 15:01
  • బైట్ ఇచ్చేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్న శ్రీకాంత్
  • నీ బైట్ వల్ల నేను హర్ట్ అయ్యానన్న నరేశ్
  • ఇంకోసారి ఇలాంటి బైట్స్ ఇవ్వొద్దంటూ వార్నింగ్   
Actror Naresh fires on Srikanth

హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం తర్వాత సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ బైట్ ఇచ్చేటప్పుడు ఓసారి ఆలోచించి మాట్లాడండి అని హితవు పలికారు. నరేశ్ ఇచ్చిన బైట్ కరెక్ట్ కాదనిపించిందని... చనిపోయిన వారిని ప్రస్తుత సమయంలో ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదేమో అని అన్నారు. శ్రీకాంత్ వ్యాఖ్యలకు నరేశ్ ఈరోజు కౌంటర్ ఇచ్చారు. ఓ వీడియోను వదిలారు.

'ఏంటమ్మా శ్రీకాంత్, అలా బైట్ ఇచ్చావ్?' అని నరేశ్ ఎద్దేవా చేశారు. ప్రమాద సమయంలో సాయితేజ్ స్పీడ్‌లో లేడని, బురద ఉండటం వల్ల జారిపడ్డాడని చెప్పారు. తాను చనిపోయిన వాళ్ల గురించి మాట్లాడలేదని, ఇండస్ట్రీలో జరిగిన విషయాల గురించి మాట్లాడానని అన్నారు. ప్రమాదాలు ఎవరికైనా జరుగుతాయని చెప్పారు.

నీవు ఇచ్చిన బైట్ వల్ల హర్ట్ అయ్యానని అన్నారు. నా కళ్ల ముందే నువ్వు హీరోగా ఎదిగావని... 'మా' ఎన్నికల్లో తన ఎదురు ప్యానల్ ద్వారా పోటీ చేసి ఓడిపోయావని ఎద్దేవా చేశారు. ఇంకోసారి ఇలాంటి బైట్స్ ఇవ్వొద్దని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు శ్రీకాంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.