ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును బుజ్జగించే పనిలో బీసీసీఐ!

14-09-2021 Tue 14:17
  • టీమిండియా, ఇంగ్లండ్ ఐదో టెస్టు రద్దు
  • టీమిండియా ఓడినట్టు ప్రకటించాలంటున్న ఈసీబీ
  • టెస్టు రీషెడ్యూల్ కు బీసీసీఐ మొగ్గు
  • జులైలో రెండు అదనపు టీ20లు ఆడతామని ప్రతిపాదన
BCCI latest proposal to ECB

కరోనా ప్రభావంతో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు అనూహ్యంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియా ఆటగాళ్లలో ఎవరికీ కరోనా లేకపోయినా వారు ఆడేందుకు మొగ్గుచూపలేదని, అందుకే ఆ టెస్టును వారు ఓడిపోయినట్టు ప్రకటించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పట్టుబడుతోంది. బీసీసీఐ మాత్రం ఈ టెస్టును రీషెడ్యూల్ చేసి భవిష్యత్తులో ఎప్పుడయినా సరే 'ఐదో టెస్టు'గానే ఆడతామని స్పష్టం చేస్తోంది.

ఈ క్రమంలో గరంగరంగా ఉన్న ఈసీబీని బుజ్జగించేందుకు బీసీసీఐ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వచ్చే జులైలో ఇంగ్లండ్ తో 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఇప్పటికే ఫిక్స్ కాగా, అదనంగా మరో రెండు టీ20లు కూడా ఆడతామని భారత క్రికెట్ బోర్డు ఆఫర్ చేసింది. ఐదో టెస్టు రద్దుతో జరిగిన నష్టాన్ని, ఈ రెండు అదనపు టీ20ల ద్వారా భర్తీ చేసుకోండి అంటూ బీసీసీఐ ప్రతిపాదిస్తోంది.

ఈ లేటెస్ట్ ఆఫర్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా నిర్ధారించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? లేదా? అన్నది ఈసీబీకే వదిలేశామని ఆయన తెలిపారు.