కోహ్లీ ‘అర్ధరాత్రి’ లేఖల వల్లే మ్యాచ్​ ఆగిపోయిందట.. ఇంగ్లండ్​ మాజీ కెప్టెన్​ ఆరోపణలు

14-09-2021 Tue 14:11
  • బీసీసీఐకి లేఖలు పంపాడన్న డేవిడ్ గోవర్
  • కరోనా కారణమైతే మిగతా మ్యాచ్ లనూ రద్దు చేయాల్సింది
  • ఐదో టెస్టు రద్దుతో ఐపీఎల్ కు లింకుంది
England Ex Captain David Gower Alleges Kohli Stopped Fifth Test By sending Midnight Letters

కరోనా కలకలంతో ఇంగ్లండ్ తో మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు రద్దయిపోయింది. అసలు జరుగుతుందో.. జరగదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ పై వివాదాలు ముసురుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ అంటూ జరిగితే సిరీస్ లో భాగంగానే రీషెడ్యూల్ చేయాలని సౌరవ్ గంగూలీ అంటుంటే.. మరోవైపు ఇంగ్లండ్ మాజీలు మాత్రం భారత జట్టుపై ఆడిపోసుకుంటున్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ కు ముందు అర్ధరాత్రి బీసీసీఐకి లేఖలు రాసి.. మ్యాచ్ ను రద్దు చేయించాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ఆరోపించాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ ఆరోపణలు చేశాడు. కరోనా వస్తుందని ఎవరూ తెలుసుకోలేకపోయారా ఏంటీ? అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఒక్క ఐదో మ్యాచ్ ను మాత్రమే ఎందుకు రద్దు చేసినట్టంటూ అతడు నిలదీశాడు. కరోనా భయం అని అనుకుంటే మిగతా మ్యాచ్ లనూ రద్దు చేయాల్సిందని అన్నాడు.

ఐదో టెస్టు ఆరంభానికి ముందు అర్ధరాత్రి బీసీసీఐకి కోహ్లీ లేఖలు రాశాడని, అందుకే మ్యాచ్ లను బీసీసీఐ రద్దు చేసిందని ఆరోపించాడు. ఒకవేళ ఐపీఎల్ కోసమే ఈ మ్యాచ్ ను రద్దు చేసి ఉంటే మాత్రం అది తీవ్రమైన చర్యేనని అతడు అన్నాడు. ఐపీఎల్ కు, ఐదో టెస్ట్ రద్దుకు కచ్చితంగా సంబంధం ఉందని మండిపడ్డాడు.