ఏపీ సీఎం జగన్ బెయిల్​ రద్దు చేయాలన్న పిటిషన్​ ను వేరే కోర్టుకు బదలాయించండి: తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్​

14-09-2021 Tue 12:52
  • వారిద్దరి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో గతంలో పిటిషన్
  • ఇటీవలే విచారణ పూర్తి
  • రేపు తుది ఆదేశాలివ్వనున్న కోర్టు
  • పిటిషన్ ను కొట్టేసిందన్న వార్తల నేపథ్యంలో హైకోర్టుకు రఘురామ
Raghurama Moves Telangana High Court Over AP CM YS Jagan and Vijaya Sai Bail Plea

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతుండగానే పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. వారి బెయిల్ రద్దు పిటిషన్ ను మరో కోర్టుకు బదలాయించాలని కోరుతూ ఆయన హైకోర్టు మెట్లెక్కారు.

జగన్, విజయసాయిల బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ విచారణను ఇటీవలే పూర్తి చేసిన సీబీఐ కోర్టు.. రేపు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే రేపు సీబీఐ కోర్టు ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును హైదరాబాద్, తెలంగాణలోని ఇతర క్రిమినల్ కోర్టులకు బదిలీ చేయాలని ఆయన కోరారు. పిటిషన్ ను అత్యవసర విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఆ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు ఆమోదం తెలిపింది.