USA: 'మెట్ గాలా' వేడుకలో అమెరికా రాజకీయ​ నాయకురాలు.. ఆమె డ్రెస్​ పైనే చర్చంతా!

  • గ్రాండ్ గా మెట్ గాలా
  • తెల్లటి గౌన్ లో మెరిసిన అమెరికా డెమొక్రటిక్ నేత
  • ట్యాక్స్ ద రిచ్ అంటూ సందేశం
  • సమానత్వం, పారదర్శకత కోసమేనంటూ కామెంట్
US Democratic Leader Draws Attention With Her Dressing

అంగరంగ వైభవంగా ‘మెట్ గాలా’ మొదలైపోయింది. అందాల భామలు అందమైన డ్రెస్సులో మెరిసిపోతూ రెడ్ కార్పెట్ పై నడుస్తూ ప్రేక్షకులను మైమరిపించేశారు. స్టార్లతో ఆ వేదికంతా కలర్ ఫుల్ గా మారిపోయింది. అయితే, ఆ స్టార్లలో అందరికన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం ఓ అమెరికా రాజకీయ నాయకురాలు.

సినీ సంబరాలేంటి? రాజకీయ నాయకురాలు రావడమేంటి? అన్న సందేహమొచ్చిందా? అవును, డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ మెట్ గాలాకు వచ్చారు. ఈ గాలాకు ఆమె రావడమూ తొలిసారే. అయితే, ఆమె రావడం కన్నా, ఆమె వేసుకున్న డ్రెస్సే ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చకు దారి తీసింది.


తెల్లటి పొడవాటి గౌన్ తో ముస్తాబైన అలెగ్జాండ్రియా.. ఆ డ్రెస్ పై ఇచ్చిన సందేశం అలాంటిది మరి. ‘ట్యాక్స్ ద రిచ్ (సంపన్నులకు పన్ను వేయాలి)’ అని పేర్కొంటూ తాటికాయంత ఎర్రటి అక్షరాలను ఆమె తన డ్రెస్ పై రాయించింది. సందడిగా, జాలీగా ఉండే ఇలాంటి వేదికపై సొసైటీకి మెసేజ్ ఇవ్వడంతో నెటిజన్లు తెగ చెవులు కొరికేసుకుంటున్నారు. మన సమాజంలో సమానత్వం, పారదర్శకతను ప్రతిబింబించడం కోసమే ఇలాంటి డ్రెస్ వేసుకుని గాలాకు వచ్చినట్టు అలెగ్జాండ్రియా చెప్పారు. దీనిపై చర్చ జరగడం మంచిదేనని అన్నారు.

కాగా, ఈ డ్రెస్ ను బ్రదర్ వెలిస్ అనే సంస్థ డిజైన్ చేసింది. ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చిన అలెగ్జాండ్రియా ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. మరికొందరు మాత్రం ‘ఇదెక్కడి చోద్యం రా బాబూ’ అంటూ గొణుక్కుంటున్నారు.



మెట్ గాలా అంటే?

మెట్ గాలాను మామూలుగా మెట్ బాల్ అని కూడా పిలుస్తుంటారు. కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ గాలా, కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ బెనిఫిట్ అనే మరో రెండు పేర్లూ ఉన్నాయి. గ్లామరస్ గా సాగే ఈ గాలాను ఏదో అవార్డుల కోసమో లేదంటే వినోదం కోసమో నిర్వహించరు. వాస్తవానికి ఇదో ఫండ్ రైజింగ్ (నిధుల సేకరణ) ఈవెంట్.

న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ కోసం నిధుల సమీకరణలో భాగంగా ఏటా ‘మే’లో ‘మొదటి సోమవారం’ ఈ ‘మెట్ గాలా’ను నిర్వహిస్తుంటారు. 1948లో మొదలైన ఈ ఈవెంట్ నిర్విరామంగా కొనసాగుతోంది. నిజానికి ఈ ఏడాది మేలోనే జరగాల్సిన ప్రోగ్రామ్.. కరోనా కారణంగా ఇన్ని నెలలు వాయిదా పడింది. నిన్న మొదలైంది. ఇంకో విషయం తెలుసా.. 2019లో జరిగిన ఈవెంట్ కోసం ఒక్క ఎంట్రీకి 30 వేల డాలర్ల ఫీజును పెట్టారట!

More Telugu News