మ‌ళ్లీ విధుల్లో చేరిన ఆఫ్ఘ‌నిస్థాన్ పోలీసులు

14-09-2021 Tue 10:37
  • తాలిబ‌న్ల పిలుపుతో విధుల్లోకి
  • కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద మీడియాతో మాట్లాడిన పోలీసులు
  • తాలిబ‌న్ క‌మాండ‌ర్లు త‌మ‌కు ఫోన్ చేశార‌ని వివ‌ర‌ణ

ఆఫ్ఘ‌నిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల వ‌శ‌మైన విష‌యం తెలిసిందే. దీంతో కొన్ని రోజులుగా ఆ దేశంలోని పోలీసులు విధుల‌కు దూరం ఉంటున్నారు. అయితే, తాలిబ‌న్ల పిలుపుతో పోలీసులు మ‌ళ్లీ విధుల్లో చేరారు. ప‌లు ప్రాంతాల్లో ఆఫ్ఘ‌న్ పోలీసులు తాజాగా విధులు నిర్వ‌హిస్తూ క‌న‌ప‌డ్డారు.

తాలిబ‌న్ క‌మాండ‌ర్ల‌ పిలుపు మేర‌కు తాము మ‌ళ్లీ విధుల్లో చేరిన‌ట్లు మీడియాకు తెలిపారు. కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద విధులు నిర్వ‌హిస్తోన్న పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా తాలిబ‌న్ క‌మాండ‌ర్లు త‌మ‌కు ఫోన్ చేశార‌ని, విధుల్లోకి రావాల‌ని చెప్పారని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో తిరిగి తాము మ‌ళ్లీ విధుల్లో చేరడం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. ప్రస్తుతం మ‌ళ్లీ విమానాశ్ర‌యంలోని ప్ర‌ధాన భ‌వ‌నాలతో పాటు చెక్ పాయింట్ల వ‌ద్ద పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.