ఖైరతాబాద్ గణేశుడికి కొత్తందం.. తొలిసారి పగడితో దర్శనమిస్తున్న మహాగణపతి

14-09-2021 Tue 10:15
  • వినాయకుడికి పగడి ఉంటే బాగుంటుందని భావించిన స్థానికులు
  • బాహుబలి సినిమాలో పగడీలు చేసిన బృందాన్ని ఆశ్రయించిన వైనం
  • 14 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుతో పగడి తయారీ
Khairatabad Maha Ganapathi Wears Turban

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి భక్తులకు సరికొత్తగా దర్శనమిస్తున్నాడు. తలకు పాగా (పగడి)తో మరింత అందంగా కనిపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరులకు తలకు పగడి ఉండడాన్ని గమనించిన స్థానికులు రాకేష్ ముదిరాజ్, ముకేశ్ ముదిరాజ్‌.. మహాగణపతికి కూడా పగడి ఉంటే బాగుంటుందని అనుకున్నారు. ఇదే విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు.

వారు పగడి పెట్టేందుకు అంగీకరించడంతో బాహుబలి సినిమాలో పగడిలను రూపొందించిన చార్మినార్‌కు చెందిన బృందం వద్దకు వెళ్లి విషయం చెప్పారు. మహాగణపతికి పగడి తయారుచేసేందుకు వారు ముందుకొచ్చి అందుకు అవసరమైన మెటీరియల్‌తో ఖైరతాబాద్ చేరుకున్నారు. 14 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉండే పగడీని తయారు చేసి వినాయకుడికి అలంకరించారు. ఇప్పుడు పగడితో వినాయకుడు మరింత అందంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.