TRS: పార్టీ కోసం ఎంతో చేసినా గుర్తింపు లేదంటూ ఆవేదన.. ప్రగతి భవన్ వద్ద టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

  • పార్టీ కోసం కష్టపడినా ఫలితం లేదంటూ ఆవేదన
  • డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నం
  • అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
TRS leader Attempt to Suicide at TRS Bhavan

పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, మరెంతో ఖర్చు చేశానని, అయినప్పటికీ పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదంటూ టీఆర్ఎస్ నేత లక్ష్మణ్ ముదిరాజ్ ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. జనగామకు చెందిన లక్ష్మణ్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలోనే ఉన్నారు. పార్టీ కోసం సొంత డబ్బులు కూడా ఖర్చు చేశారు.

పార్టీలోకానీ, ప్రభుత్వంలో కానీ ఏదైనా పదవి ఇవ్వాలని పలుమార్లు అగ్రనేతలను కలిసి విన్నవించుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన నిన్న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.

దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లక్ష్మణ్ పోలీస్ స్టేషన్‌లోనూ కాసేపు బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన పోలీసులు ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

More Telugu News